Oxfam: కుబేరుల సంపదను మరింతగా పెంచిన కరోనా మహమ్మారి!
- 3.9 ట్రిలియన్ డాలర్లు పెరిగిన సంపద
- టాప్ 10 బిలియనీర్స్ కు 540 బిలియన్ డాలర్ల లాభం
- 50 కోట్ల వరకూ పెరిగిన పేదల సంఖ్య
- ఆక్స్ ఫామ్ కీలక నివేదిక
2019 చివర్లో ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా మహమ్మారి, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, ప్రపంచ కుబేరులకు మాత్రం తమ సంపదను పెంచుకునే అవకాశాలను దగ్గర చేసింది. విద్య, ఆరోగ్యం, వైద్య రంగాల్లో లక్షాధికారులుగా ఉన్న వారిని కోటీశ్వరులుగా చేసింది. ప్రజలంతా మరింత మెరుగైన ఆరోగ్య జీవనాన్ని కోరుకోవడమే ఇందుకు కారణమని స్విట్జర్లాండ్ లో జరుగుతున్న దావోస్ సమ్మిట్ లో ఆక్స్ ఫామ్ గ్రూప్ ఓ నివేదికను సోమవారం నాడు విడుదల చేసింది.
ఇక, కరోనా ప్రపంచాన్ని పట్టుకున్న తరువాత... అంటే మార్చి 18 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రపంచ బిలియనీర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్ల వరకూ పెరిగిందని, టాప్ 10 అత్యధిక ధనవంతుల సంపద 540 బిలియన్ డాలర్లు పెరిగిందని ఆక్స్ ఫామ్ వెల్లడించింది. ఇదే సమయంలో కోట్లాది మంది పేదలు మరింత పేదలుగా మారారని, ప్రపంచంలోని పేదల జనాభా 20 నుంచి 50 కోట్ల వరకూ పెరిగిందని అంచనా వేసింది.
"ఈ మహమ్మారి ప్రపంచంలోని అత్యధికులపై ప్రభావం చూపింది. రోజుకు కేవలం 2 నుంచి 10 డాలర్ల మధ్య వెచ్చిస్తూ జీవనం గడుపుతున్న వారిపైనే ఈ ప్రభావం అధికం. వాణిజ్య రవాణా వ్యవస్థలు నిలిచిపోయిన వేళ, వీరి జేబుల నుంచి ఎన్నో వందల కోట్లు ఆవిరై పోయాయి" అని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.