Chandrababu: సుప్రీంకోర్టు తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి: చంద్రబాబు
- ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం పచ్చజెండా
- సుప్రీం తీర్పును స్వాగతించిన చంద్రబాబు
- వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శ
- ప్రతి వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు వైసీపీ ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలని అన్నారు.
వైసీపీ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు అన్నీఇన్నీ కావని, ప్రతి రాజ్యాంగ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల ధ్వంసమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోర్టుల జోక్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడగలుగుతున్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.