Mamata Banerjee: 'జై శ్రీరామ్' నినాదాలు చేసి నేతాజీని అవమానించారు: మమతా బెనర్జీ
- బీజేపీపై ధ్వజమెత్తిన మమత
- భారత్ ను మండించే పార్టీ అంటూ వ్యాఖ్యలు
- ప్రధాని ముందే తనకు అవమానం జరిగిందన్న మమత
- బీజేపీ సంస్కృతి అదేనంటూ విమర్శలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు బీజేపీపై మండిపడ్డారు. నేతాజీ 125వ జయంతి వేడుకల సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసి ఆ మహనీయుడ్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, బీజేపీని 'బయటి వ్యక్తుల పార్టీ' అని, 'భారత్ జలావో పార్టీ' (భారత్ ను మండించే పార్టీ) అని విమర్శించారు.
"ఎవరినైనా మీరు ఇంటికి ఆహ్వానించి అవమానిస్తారా? ఇది బెంగాల్ సంస్కృతి, లేక దేశ సంస్కృతి అనిపించుకుంటుందా? నేతాజీని స్తుతిస్తూ నినాదాలు చేస్తే నాకెలాంటి సమస్య ఉండదు, కానీ వాళ్లు అలా చేయలేదు. నన్ను రెచ్చగొట్టేందుకు ఈ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేశారు. దేశ ప్రధాని ముందు నేను తీవ్ర అవమానానికి గురయ్యాను. అదే వారి సంస్కృతి" అని వ్యాఖ్యానించారు. పుర్సురాలో జరిగిన ఓ సభలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు.