Donald Trump: సెనేట్ ముందుకు వచ్చిన ట్రంప్ అభిశంసన తీర్మానం!
- ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించిన ప్రతినిధుల సభ
- ఫిబ్రవరి 8 నుంచి సెనెట్ లో చర్చలు
- తమకు నష్టం కలుగకుండా చూసుకోవాలని భావిస్తున్న రిపబ్లికన్లు
అమెరికాలో మరో చారిత్రాత్మక ఘటనకు నేడు తెరలేవనుంది. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు ఆమోదించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానం సోమవారం రాత్రి సెనేట్ ముందుకు వచ్చింది. మూడు వారాల క్రితం అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ పై ట్రంప్ నిరసనకారులు దాడికి దిగిన తరువాత, ఒక్కసారిగా పరిస్థితులన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా మారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నెల 19నే ట్రంప్ వైట్ హౌస్ ను వదిలి వెళ్లగా, ఆ మరుసటి రోజున జో బైడెన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి రెండు రోజుల ముందే ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రతినిధుల సభ ముందుంచారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల బలం అధికంగా ఉండటంతో, అభిశంసన బిల్లుకు పెద్దగా ఆటంకాలు ఏర్పడలేదు. ట్రంప్ ను అభిశంసించడం జో బైడెన్ కు ఇష్టం లేదని కూడా వార్తలు వచ్చాయి.
వాస్తవానికి సెనెట్ లో రిపబ్లికన్లకే స్వల్ప మెజారిటీ ఉంది. ఇదే సమయంలో క్యాపిటల్ హౌస్ పై దాడి తరువాత ట్రంప్ వైఖరిని విమర్శించిన వారు, ఇప్పుడు తమ పార్టీ పరువును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరి 6న జరిగిన ఘటనల తరువాత ట్రంప్ మారిపోయారని పలువురు రిపబ్లికన్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన బిల్లుపై సెనెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఇదే సమయంలో తన వర్గం నిరసనకారులను ఉద్యమం వైపు పురిగొల్పేందుకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది అమెరికన్లకు ఆగ్రహాన్ని తెప్పించాయని, ఆయన్ను అభిశంసించాల్సిందేనని డెమొక్రాట్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. "ఫైట్ లైక్ హెల్" అని ఆయన మద్దతుదారులను ఎగదోయడం, అధ్యక్ష పదవిని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నించడం ద్వారా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూశారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెనెట్ లో ట్రంప్ అభిశంసన బిల్లుపై విచారణ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. అసలు ట్రంప్ పై విచారణ జరిపించాలా? అన్న విషయాన్ని సెనెట్ తేల్చనుంది. ఈ బిల్లును సెనెట్ ఆమోదిస్తే, రిపబ్లికన్ల పార్టీ మొత్తం ఇబ్బందుల్లో పడినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా, పరిస్థితులను సమన్వయపరిచి, తమకు నష్టం కలుగకుండా చూసుకోవాలని రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు.