Arnab Goswami: అర్నాబ్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు.. రేటింగ్స్ మార్చేందుకు రూ. 40 లక్షలు ఇచ్చారన్న బార్క్ మాజీ చీఫ్ 

Arnab paid me Rs 40 lakh to fix ratings says partho dasgupta

  • వాంగ్మూలంలో పార్థోదాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
  • విదేశీ పర్యటనల కోసం తనకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారన్న బార్క్ మాజీ చీఫ్
  • 3600 పేజీలతో చార్జ్‌షీట్
  • సాయం చేస్తే భవిష్యత్తులో అండగా ఉంటానని పార్థోదాస్‌కు అర్నాబ్ హామీ

టీవీ రేటింగ్ కుంభకోణం కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ చీఫ్ పార్థో దాస్‌గుప్తా కీలక విషయాలను వెల్లడించారు.

రేటింగ్స్  మార్చేందుకు అర్నాబ్ తనకు రూ. 40 లక్షలు ఇవ్వడంతోపాటు రెండు విహారయాత్రల కోసం రూ. 8.75 లక్షలు ఇచ్చినట్టు ముంబై పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీని ఆధారంగా ముంబై పోలీసులు ఈ నెల 11న టీఆర్పీ కుంభకోణంలో మరో సప్లిమెంట్ చార్జిషీటును నమోదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. మొత్తం 3600 పేజీలున్న ఈ చార్జ్‌షీటులో బార్క్ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికతోపాటు అర్నాబ్‌కు, దాస్‌గుప్తాకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగులు, 59 మంది ఇచ్చిన వాంగ్మూలాలను చేర్చారు.

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. అర్నాబ్ తనకు 2004 నుంచి తెలుసని, ‘టైమ్స్ నౌ’లో తామిద్దరం కలిసి పనిచేశామని పేర్కొన్నారు. తాను 2013లో బార్క్ సీఈవోగా చేరానని, 2017లో అర్నాబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారని తెలిపారు. తనకు సాయం చేస్తే భవిష్యత్తులో అండగా నిలుస్తానని అర్నాబ్ చెప్పేవారని పేర్కొన్నారు. దీంతో తన బృందంతో కలిసి రిపబ్లిక్ టీవీకి అగ్రస్థానం వచ్చేలా టీఆర్పీ రేటింగులలో అవకతవకలకు పాల్పడినట్టు చెప్పారు.  

2017లో సెయింట్ రెజీస్ హోటల్‌ వద్ద తనను కలిసిన అర్నాబ్ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ పర్యటనల కోసం తనకు రూ. 4.37 లక్షలు ఇచ్చారని పార్థోదాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2019లో తిరిగి అదే హోటల్ వద్ద డెన్మార్క్, స్వీడన్ పర్యటనల కోసం మరో మారు అంతే మొత్తంలో డబ్బులు ఇచ్చారని వివరించారు. 2017లో ఐటీసీ పారెల్ హోటల్ వద్ద రూ. 20 లక్షల నగదు ఇచ్చారని, రెండేళ్ల తర్వాత మళ్లీ అదే హోటల్ వద్ద రూ. 10 లక్షలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News