Brinda karat: మోదీ ఆటలు ఇక సాగవు.. ఆయన తమ్ముడు కేసీఆర్‌ది పూటకోమాట: నిప్పులు చెరిగిన బృందాకారత్
- కొత్తగూడెంలో పోడుసాగుదారుల ప్రజాగర్జన
- మోదీ నియంతను తలపిస్తున్నారని మండిపాటు
- కేసీఆర్ గిరిజనుల నుంచి భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం
- సాగుచట్టాలకు వ్యతిరేకమైతే అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేసీఆర్‌కు సవాల్
భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న నిర్వహించిన పోడు సాగుదారుల ప్రజాగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ప్రజావ్యతిరేక విధానాలతో నియంతను తలపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, పూటకోమాట మాట్లాడే ఆయన తమ్ముడు కేసీఆర్‌లపై ప్రజలు తిరగబడే రోజు అతి దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.
రైతులను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. అదానీ, అంబానీల కోసం రైతుల వెన్ను విరిచేందుకు ప్రయత్నిస్తే గుణపాఠం తప్పదన్నారు. తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పోడును నమ్ముకుని దశాబ్దాలుగా జీవిస్తున్న గిరిజనుల కోసం అటవీ చట్టాలను అమలు చేసి, హక్కు పత్రాలు ఇవ్వాలని బృందాకారత్ డిమాండ్ చేశారు. ఉదయం ఒక మాట, సాయంత్రం మరోమాట మాట్లాడే కేసీఆర్ హరితహారం పేరుతో గిరిజనుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమైతే శాసనసభలో తీర్మానం చేయాలని బృందాకారత్ డిమాండ్ చేశారు.