Republic Day: అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు.. ఇది నాలుగోసారి
- 72వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న భారత్
- చివరి నిమిషంలో రద్దయిన బోరిస్ జాన్సన్ పర్యటన
- గతంలో మూడుసార్లు అతిథి లేకుండానే వేడుకలు
విదేశీ అతిథి సమక్షంలో భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారానికి ఈసారి బ్రేక్ పడింది. నేడు దేశం జరుపుకుంటున్న 72వ గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావాల్సి ఉండగా, ఆ దేశంలో వెలుగుచూసిన కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో ఆయన సారీ చెప్పేశారు. దీంతో అతిథి లేకుండానే వేడుకలు ముగిశాయి. విదేశీ అతిథి లేకుండానే వేడుకలు జరుపుకోవడం ఇదే తొలిసారేం కాదు. గతంలోనూ మూడుసార్లు.. అంటే 1952, 1953, 1966లలో ఇలానే జరిగింది.
1952, 1953 గణతంత్ర దినోత్సవాలకు భారత ప్రభుత్వం ఎవరినీ ఆహ్వానించలేదు. అందుకు ఎటువంటి కారణం కూడా లేదు. అయితే, 1966లో మాత్రం దేశం తీరని విషాదంలో ఉంది. ఇండో-పాక్ యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందం కోసం అప్పటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి తాష్కెంట్ వెళ్లారు.
ఒప్పందంపై సంతకాలు చేసిన రెండు రోజుల తర్వాత 11 జనవరి 1966లో ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. ప్రధాని లేకుండా దేశం ఒక్క రోజు కూడా ఉండకూడదు కాబట్టి గుల్జారీలాల్ నందా ప్రధాని అయ్యారు. ఆ నెల 24వ తేదీ వరకు ఆయన ప్రధానిగా వ్యవహరించగా, 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. దీంతో రిపబ్లిక్ డేకు సమయం తక్కువగా ఉండడంతో అతిథిని పిలవడం సాధ్యం కాలేదు.
26 జనవరి 1950లో నిర్వహించిన తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో అతిథిగా హాజరయ్యారు. అప్పుడు మన రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ కాగా, ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆ వేడుకలు కూడా ప్రస్తుతం జరుగుతున్న రాజ్‌పథ్‌లోనే జరిగాయి.