Tamilisai Soundararajan: తెలంగాణ ఉద్యమ సమయంలో మన నాయకులు చెప్పిన మాటలు నిజమయ్యాయి: గవర్నర్ తమిళిసై
- దేశంలోనే గొప్ప రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది
- గత ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం అభివృద్ధికి కృషి
- రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది
- పల్లె సీమల రూపురేఖలు మారిపోతున్నాయి
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.
కరోనాను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా ఎదుర్కొందని ప్రశంసించారు. భారత్ బయోటెక్ తొలి దేశీయ కరోనా టీకాను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. కరోనాపై పోరాటంలో శ్రమించిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 75 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని అన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 52 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయితే దేశంలోనే గొప్ప రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని ఉద్యమ సమయంలో మన నాయకులు చెప్పేవారని అన్నారు.
ఇప్పుడు వారి మాటలు నిజమయ్యాయని తెలిపారు. గత ఆరున్నరేళ్లలో పద్ధతి ప్రకారం జరిగిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని చెప్పారు. పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి అద్భుత ఫలితాలు అందించిందని తెలిపారు. గతంలో అడవులు నరకడమే తప్ప పెంచడమనే మాటేలేదని అన్నారు.
నేడు తెలంగాణ పల్లెల్లో పోయిన పచ్చదనం పెరిగిపోయిందని తెలిపారు. రాష్ట్రంలోని 19,470 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాల పేరుతో పార్కులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అలాగే, రాష్ట్రంలో మొత్తం 2,601 చోట్ల రైతు వేదికలు నిర్మాణం ప్రారంభం కాగా, ఇప్పటికే 2,580 చోట్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాయని అన్నారు.
ప్రతి వానాకాలం సీజన్‌లో పల్లెల్లో డెంగ్యూ, మలేరియా తదితర రోగాలు విజృంభించేవని అన్నారు. ఇప్పుడు పల్లెలు పరిశుభ్రంగా మారడం వల్ల, ఆ రోగాలు జాడ లేకుండా పోయాయని కొనియాడారు. ప్రతి గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మార్చాలనే లక్ష్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు.
ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందడం, అవినీతికి అవకాశం లేకుండా చేయడం కోసం
ప్రభుత్వం అనేక పాలనా సంస్కరణలను అమలు చేస్తోందని చెప్పారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మునిసిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టాలను తెచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయరంగ విధానాలు, పథకాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని కొనియాడారు.
మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీని ఫలితంగా తెలంగాణలో భూగర్భ జలమట్టం సుమారు 4 మీటర్ల మేర పెరిగిందని చెప్పారు. రైతులకు 24 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల పంపుసెట్ల కింద పుష్కలంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.