Chiranjeevi: బాలుకి మరణానంతరం పద్మవిభూషణ్ వచ్చిందనే పదం నన్ను బాధిస్తోంది: చిరు
- బాలుకి అవార్డు రావడం పట్ల మాత్రం చాలా ఆనందంగా ఉంది
- ఆ అవార్డుకు ఆయన అర్హుడు
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కేంద్ర ప్రభుత్వం నిన్న పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డులు రాగా వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. తన ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడని అన్నారు.
బ్రాకెట్స్లో మరణానంతరం వచ్చిన పద్మవిభూషణ్ అనే పదం ఉండడం మాత్రం తనను చాలా బాధిస్తోందని తెలిపారు. ఆయన పద్మవిభూషణ్ అవార్డును వ్యక్తిగతంగా స్వీకరించి ఉంటారనే భావిస్తున్నానని అన్నారు. కాగా, ఆడియో రూపంలో చిరంజీవి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విస్తృతంగా రక్తదానం చేయాలని కోరారు. చిరంజీవి బ్లడ్ బ్లాంక్‌లో రక్తదానం చేస్తోన్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.