Green Land: 23 ఏళ్లలో 28 లక్షల కోట్ల టన్నుల ఐస్ ఆవిరి!
- 1994 నుంచి 2017 వరకు 65 శాతం పెరిగిన మంచు కరుగుదల
- ఏటా 1.3 లక్షల టన్నుల మేర కరుగుతున్న మంచు
- పెరుగుతున్న సముద్ర మట్టాలు.. తీర ప్రాంతాలకు ముప్పు
- ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 28 లక్షల కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయింది. సముద్ర మట్టాలను పెంచేస్తోంది. తీర ప్రాంతాలకు చేటు తెస్తోంది. 1994 నుంచి 2017 వరకు 23 ఏళ్లలో భారీగా ఐస్ కరిగిపోయిందని ఇంగ్లాండ్ లోని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.
భూమ్మీద ఉన్న హిమనీ నదాలు, గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికాల్లోని ధ్రువ మంచు పలకలు, ఆర్కిటిక్, దక్షిణాది మహా సంద్రాల్లో తేలియాడే మంచు కొండలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఉపగ్రహ సమాచారం ఆధారంగా 2.15 లక్షల మంచు ప్రాంతాల పరిస్థితిని అంచనా వేశారు.
మునుపటితో పోలిస్తే చాలా వేగంగా ధ్రువ ప్రాంతాల్లోని ఐస్ కరిగిపోతోందని నిర్ధారించారు. 1990ల్లో ఏటా 80 వేల కోట్ల టన్నుల ఐస్ కరిగితే.. 2017 నాటికి 1.3 లక్షల కోట్ల టన్నుల ఐస్ కరుగుతోందని గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచు కరగడం 65 శాతం పెరిగిందని తేల్చారు. అంటార్కిటికా, గ్రీన్ ల్యాండ్ లలోనే మంచు ఎక్కువగా కరిగిందని నిర్ధారించారు. దీని వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, తీర ప్రాంతాలకు ముప్పు ముంచుకొస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేనంతగా మంచు పలకలపై ఉష్ణ ప్రభావం పడుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు థామస్ స్లేటర్ తెలిపారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నిర్దేశించిన దాని కన్నా ఎక్కువగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1980 నుంచి ఇప్పటిదాకా వాతావరణంలో సగటున 0.26 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగ్గా.. సముద్రాల్లో 0.12 డిగ్రీల మేర పెరిగాయని చెప్పారు. ఐస్ కరిగే కొద్దీ.. సముద్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని మరో పరిశోధకురాలు ఇసోబెల్ లారెన్స్ చెప్పారు. దీంతో ఆర్కిటిక్ మరింత వేడెక్కుతోందని వివరించారు.