Russia: భారత్ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన రష్యా
- రష్యాను కూడా అతలాకుతలం చేసిన కరోనా
- అప్పట్లోనే ప్రయాణ ఆంక్షలు విధింపు
- భారత్, ఫిన్లాండ్, ఖతార్, వియత్నాంలపై ఆంక్షలు
- ఆంక్షలు తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు చేసిన ప్రధాని
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో రష్యా ఇతర దేశాలపై కఠిన ఆంక్షలను విధించింది. ప్రస్తుతం కరోనా తీవ్రత నిదానించిన నేపథ్యంలో ఇప్పుడా ఆంక్షలు తొలగిస్తున్నట్టు ప్రకటించింది. చైనాలో కరోనా ఉనికి మొదలయ్యాక రష్యా తన సరిహద్దులను మూసేసి కట్టుదిట్టం చేసింది. ఆ తర్వాత రష్యాలోనూ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో రష్యా.... భారత్, వియత్నాం, ఖతార్, ఫిన్లాండ్ వంటి దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఇప్పుడా ఆంక్షలను ఎత్తివేస్తూ రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని షరతులు విధించారు. ఆ నాలుగు దేశాల ప్రజల్లో రష్యాలో రెసిడెన్స్ పర్మిట్ కలిగి ఉన్నవారికి మాత్రమే తమదేశంలో ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అటు, రష్యా ప్రజలు ఆ నాలుగు దేశాలకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.