Farmers protest: కర్రలు, తల్వార్లతో పోలీసులపై రైతుల దాడి.. 83 మంది పోలీసులకు గాయాలు
- హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ
- పగిలిన పోలీసుల తలలు
- భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
- ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న రైతు నేతలు
గణతంత్ర దినోత్సవాన ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులపై కర్రలు, తల్వార్లతో దాడి చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనలో 83 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో చాలామంది తలలు పగిలినట్టు ఎల్ఎన్జీ ఆసుపత్రి సీఎంవో తెలిపారు. ఎర్రకోటపైకి ఎక్కి జెండాలు ఎగురవేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను మోహరించారు.
పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. కాగా, తమ ఆందోళనలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, ర్యాలీ హింసాత్మకంగా మారడానికి అవే కారణమని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు.