Goplakrishna Dwivedi: ద్వివేది, గిరిజా శంకర్‌లు క్షమించరాని తప్పు చేశారు.. అభిశంసన ఉత్తర్వులు జారీ చేసిన రమేశ్‌కుమార్
- హైకోర్టు చెప్పినా పెడచెవిన పెట్టారు
- ఉద్దేశపూర్వకంగానే సహకరించడం లేదు
- ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం
- 3.62 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని, సిబ్బందిని, వనరులను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమకూర్చాలని హైకోర్టు ఆదేశించినా ఏమాత్రం సహకరించలేదని ఆరోపిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బదిలీ చేస్తూ, అభిశంసిస్తూ నిన్న ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
అంతేకాదు, అభిశంసన ఉత్తర్వులను వారి సర్వీసు రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. ఎన్నికల సంఘానికి వీరిద్దరూ ఎంతమాత్రమూ సహకరించకపోగా, 2021 ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం వహించారని, ఫలితంగా 3.62 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతున్నారని రమేశ్ కుమార్ తెలిపారు. కావాలని, దురుద్దేశపూర్వకంగానే వారు తమ బాధ్యతను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిద్దరి నిర్లక్ష్యం కారణంగా విధిలేని పరిస్థితుల్లో 2019 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికల నిర్వహణకు వెళ్లాల్సి వస్తోందని ఎస్‌ఈసీ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఓటు హక్కు కోల్పోవడానికి పూర్తి బాధ్యత వారిదేనని, క్షమించరాని తప్పు చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ద్వివేది, గిరిజాశంకర్‌లు తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొంటూ 8 పేజీల అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు.