Chittoor District: గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీపై బదిలీ వేటు.. నిమ్మగడ్డ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు

Chittoor and Guntur Collectors Transferred

  • గత రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీ
  • ఉదయమే అందిన మౌఖిక ఆదేశాలు
  • గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత తప్పుకోవాలని ఆదేశం

గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సమయంలో హింసను, అక్రమాలను నివారించడంలో విఫలమైన చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు నారాయణ భరత్ గుప్తా, ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్పీ ఎ.రమేశ్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, ఆయన ఆదేశాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.

తాజాగా, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిమ్మగడ్డ నేరుగా రంగంలోకి దిగారు. వారిని తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాలతో గత రాత్రి పొద్దుపోయాక  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బదిలీ అయిన వారి స్థానాల్లో ఆయా  జిల్లాల జేసీలు కలెక్టర్లుగా వ్యవహరించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా మార్కండేయులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా దినేశ్ కుమార్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చిత్తూరు ఎస్పీ ఎస్.సెంథిల్ కుమార్ తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గణతంత్ర వేడుకలు ముగిసిన వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నిన్న ఉదయమే వారికి మౌఖికంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో నిన్న సాయంత్రమే విధుల నుంచి వారు తప్పుకున్నారు.

  • Loading...

More Telugu News