Chandrababu: ఏపీ పంచాయతీ ఎన్నికలు: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
- బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడండి
- నామినేషన్ల స్వీకరణ తొలి రోజే వీలైనన్ని దాఖలు చేయండి
- వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకోండి
- స్వేచ్ఛగా, నిర్భయంగా నామినేషన్లు వేయండి
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుకున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, మండల, గ్రామ కమిటీ సభ్యులతో నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. నామినేషన్ల తొలి రోజే వీలైనన్ని ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. ముఖ్యంగా బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని సూచించారు.
అభ్యర్థులందరూ అవసరమైన ధ్రువపత్రాలను రెడీ చేసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో నో డ్యూస్ సర్టిఫికెట్ పొందేందుకు వీలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందుల సమాచారాన్ని అందించేందుకు 24 గంటలూ పనిచేసేలా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, గత 20 నెలల్లో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనిని కూడా చేపట్టలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కాలంలో పేదలపై ఏకంగా రూ. 70 వేల కోట్ల పన్నులు వేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దౌర్జన్యాలు, ఆలయాలపై దాడులతో వైసీపీ అన్ని వర్గాలకు దూరమైందన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితే వైసీపీ ఓటమి పాలవుతుందని చంద్రబాబు అన్నారు.