India: 2021 ఇండియాదే... ఏకంగా 11.5 శాతం వృద్ధిని అంచనా వేసిన ఐఎంఎఫ్!

IMF ExpectsAbove 11 Percent Growth in India this Year

  • కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచం
  • ఈ సంవత్సరం అత్యధిక వృద్ధి రేటు ఇండియాలోనే
  • ఆపై చైనా, స్పెయిన్, ఫ్రాన్స్

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న వేళ, 2021 సంవత్సరం ఇండియా ఘనమైన వృద్ధి రేటును నమోదు చేయనున్నదని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.

ఈ సంవత్సరం భారత జీడీపీ 11.5 శాతం వరకూ పెరుగుతుందని, ఈ సంవత్సరం రెండంకెల వృద్ధిని నమోదు చేసే ఏకైక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ ఇండియా నిలువనుందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం నాడు ఓ నివేదికను విడుదల చేసిన ఐఎంఎఫ్, ప్రపంచ జీడీపీ 2020లో 8 శాతం వరకూ నష్టపోయిందని, దీనికి కొవిడ్-19 కారణమని వెల్లడించింది.

ఇక ఈ సంవత్సరం వృద్ధి రేటు పరంగా ఇండియా తరువాతి స్థానంలో చైనా నిలుస్తుందని, చైనాలో 8.1 శాతం జీడీపీ గ్రోత్, ఆపై స్పెయిన్ 5.9 శాతం, ఫ్రాన్స్ 5.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్టులో ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆ తదుపరి 2022లో సైతం వృద్ధి రేటు పరంగా ఇండియాలో తొలి స్థానంలో ఉండి 6.8 శాతం జీడీపీ గ్రోత్ నమోదు చేస్తుందని, అదే సమయంలో చైనా 5.6 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది.

ఇదిలావుండగా, ఇటీవల ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా మాట్లాడుతూ, "గత సంవత్సరం కరోనాను ఎదుర్కొనేందుకు ఇండియా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది. వాటి ఫలితాలను ఈ సంవత్సరం చూడనుంది. కుదేలైన ఆర్థిక వ్యవస్థ నుంచి చాలా త్వరగానే ఇండియా కోలుకుంటోంది. వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ, కరోనా నిబంధనల అమలు, లాక్ డౌన్ ల విషయంలో తన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, విజయవంతమైంది" అని అన్నారు.

  • Loading...

More Telugu News