New Delhi: నిన్న రైలెక్కలేకపోయిన వారికి టికెట్ డబ్బులు వాపస్

Railway ready to refund fares who did not catch the train yesterday
  • రైతుల ట్రాక్టర్ల ర్యాలీతో ఉద్రిక్తంగా మారిన ఢిల్లీ
  • అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్ల ఏర్పాటు
  • సకాలంలో రైల్వే స్టేషన్లకు చేరుకోలేకపోయిన ప్రయాణికులు
ఢిల్లీలో నిన్న ట్రాక్టర్ల పరేడ్ కారణంగా రైలు అందుకోలేకపోయిన వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు మిస్సయిన వారికి టికెట్ డబ్బులను వెనక్కి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, ట్రాక్టర్ల పరేడ్‌తో ఉద్రిక్తంగా మారిన న్యూఢిల్లీ, పాతఢిల్లీ, నిజాముద్దీన్, ఆనంద్ విహార్, సఫ్దర్‌గంజ్, సరై రోహిలా స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు. వారందరికీ టికెట్ డబ్బులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

నిన్న ఢిల్లీలోకి దూసుకొచ్చిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోగా, మరికొందరు తంటాలు పడి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ రైళ్లను అందుకోలేకపోయారు.
New Delhi
Indian Railways
Ticket
Farmers Protest

More Telugu News