Britain: బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులకు కరోనా.. ఆందోళనలో అధికారులు
- 5 విమానాల్లోని 15 మందికి కరోనా
- 300 మందిని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు
- బ్రిటన్‌లో నెగటివ్.. ఇక్కడ పాజిటివ్
- తలలు పట్టుకుంటున్న అధికారులు
బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామంది కరోనా పాజిటివ్‌గా తేలుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా, అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.
దీంతో వారు కూర్చున్న సీట్లకు ముందు, వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నిజానికి బ్రిటన్‌లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకుని ఉండాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ హైదరాబాద్ వచ్చాక కొందరు పాజిటివ్‌గా తేలుతుండడం అధికారులను కలవరపరుస్తోంది.
బ్రిటన్‌లో చేయించుకున్న పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారికి సైతం ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో పాజిటివ్ వస్తుండడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు ఇలా 15 మంది పాజిటివ్‌గా తేలగా, వారందరినీ గచ్చిబౌలి లోని టిమ్స్‌కు తరలించారు. వారితో కలిసి ప్రయాణించిన మరో 300 మందిని క్వారంటైన్‌కు పంపించారు.