IPL 2021: ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్ వేలం... అందరి దృష్టి మ్యాక్స్ వెల్, స్మిత్ పైనే!
- త్వరలో ఐపీఎల్ తాజా సీజన్
- సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
- ఇప్పటికే పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేసిన జట్లు
- విడుదలైన ఆటగాళ్లతో వేలం
క్రికెట్ అభిమానులకు త్వరలోనే ఐపీఎల్ మజా లభించనుంది. ఈ వేసవిలో జరిగే ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీని లీగ్ పాలకమండలి ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని ఐపీఎల్ వెల్లడించింది. ఇటీవల పలు ఫ్రాంచైజీలు తమకు అక్కర్లేని ఆటగాళ్లను విడుదల చేశాయి. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా ఎనిమిది మంది ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్ వదిలించుకుంది.
ముంబయి జట్టు ఒక్క లసిత్ మలింగను విడుదల చేయగా, పంజాబ్ జట్టు గ్లెన్ మ్యాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్ ను వేలానికి విడిచిపెట్టింది. పంజాబ్ వద్ద ఇంకా రూ.53.2 కోట్ల సొమ్ము ఉండడంతో ఈసారి ఎవరిని తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి ఏర్పడింది. అన్ని ఫ్రాంచైజీల కంటే తక్కువగా సన్ రైజర్స్ వద్ద రూ.10.75 కోట్లు మాత్రమే ఉండడంతో ఈ ఫ్రాంచైజీ రాబోయే వేలంలో పెద్ద ఆటగాళ్ల కోసం ప్రయత్నించే పరిస్థితులు లేవు. ఎప్పట్లాగానే ఓ మోస్తరు ఆటగాళ్లతో సరిపెట్టుకుంటుందని భావిస్తున్నారు.
ఈ వేలంలో ప్రధానంగా గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టీవ్ స్మిత్ పై అందరి దృష్టి ఉండనుంది. గత ఐపీఎల్ సీజన్ లో వీళ్లిద్దరూ విఫలమయ్యారు. అయితే, బిగ్ బాష్ లీగ్ లో మ్యాక్స్ వెల్ శివమెత్తి ఆడగా, టీమిండియాతో టెస్టు సిరీస్ లో స్మిత్ సెంచరీతో విమర్శకులకు సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ తాజా వేలంలో వీరిద్దరినీ ఎవరు తీసుకుంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది.