IMF: సాగు చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది: ఐఎంఎఫ్​ చీఫ్​ ఎకనామిస్ట్​ గీతా గోపీనాథ్​

Indias new farm laws have potential to raise farm income IMF Chief Gopinath

  • దేశ వ్యవసాయంలో సంస్కరణలు అవసరమని వెల్లడి
  • చట్టాలతో రైతులు పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని వ్యాఖ్య
  • మండీలకు పన్ను చెల్లించాల్సిన అవసరమూ తప్పుతుందని వెల్లడి
  • ప్రతి రైతుకూ సామాజిక భద్రత కల్పించాలని సూచన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలు మంచివేనని, వాటితో రైతుల ఆదాయం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణలు చాలా అవసరమని ఆమె అన్నారు. మౌలిక వసతుల కల్పన, మార్కెటింగ్ రంగాల్లో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాల వల్ల మార్కెటింగ్ సౌకర్యం మరింత పెరుగుతుందని ఆమె అన్నారు. రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. మండీలకు పన్ను చెల్లించాల్సిన అవసరమే లేకుండా ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చన్నారు. దీని వల్ల రైతు ఆదాయం పెరుగుతుందన్నారు.

అయితే, ఇలాంటి చట్టాలు తీసుకొచ్చేటప్పుడు కొన్ని నష్టాలూ ఉంటాయని, కాబట్టి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి రైతుకూ సామాజిక భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ చట్టాలపై చర్చలు నడుస్తున్నాయని, ఆ చర్చలు ఎలా ముగుస్తాయో వేచి చూద్దామని అన్నారు.

కాగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది.

  • Loading...

More Telugu News