Vijaya Dairy: నంద్యాల విజయ డెయిరీ ఎన్నికల్లో వైసీపీ వర్గం విజయం... పాతికేళ్ల భూమా వర్గం ఆధిపత్యానికి అడ్డుకట్ట!
- మూడు డైరెక్టర్ పదవులు వైసీపీ కైవసం
- చైర్మన్ రేసులో ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి
- 81 ఓట్లకు 80 ఓట్లు పోలైన వైనం
- పరారీలో ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాలలో విజయ డెయిరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ అనుకూలురైన రవికాంత్ రెడ్డి, ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. తద్వారా చైర్మన్ పదవి రేసులో వైసీపీ మరింత బలంగా నిలిచింది.
విజయ డెయిరీ పరిధిలో మొత్తం 81 ఓట్లు ఉండగా, 80 మంది ఓటు హక్కు వినియోగించకున్నారు. విజయ డెయిరీ పాలకమండలిలో సభ్యత్వం ఉన్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి (అఖిలప్రియ సోదరుడు) బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దాంతో అతడు ఓటు హక్కు వినియోగించుకోలేదు. కాగా, ఎంతో ప్రతిష్ఠాత్మక నంద్యాల విజయ డెయిరీలో భూమా కుటుంబ సభ్యుల ఆధిపత్యానికి ఈ ఎన్నికలు తెరదించాయి. గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం బలపరిచిన వారే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి వైసీపీ ప్రాభవం స్పష్టంగా కనిపించింది. దాంతో, విజయ డెయిరీ పగ్గాలు భూమా కుటుంబం నుంచి ఎస్వీ కుటుంబానికి అందనున్నాయి.
ఇప్పటికే విజయ డెయిరీకి 9 మంది డైరెక్టర్లు ఉండగా, కొత్తగా ఎన్నికైన ముగ్గురు డైరెక్టర్లతో కలిసి చైర్మన్ ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి చైర్మన్ రేసులో ఉన్నారు. ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి ఎవరో కాదు... భూమా అఖిలప్రియకు స్వయానా మేనమామ. భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డికి చిన్నాన్న అయిన నారాయణరెడ్డి ఇప్పటివరకు విజయ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తూ వచ్చారు. విజయ డెయిరీకి సాలీనా రూ.140 కోట్ల రాబడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు అంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.