Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు
- సంతబొమ్మాళి ఎంపీడీఓ ఆఫీసు వద్ద విగ్రహాల ధ్వంసం
- పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్ వద్ద విగ్రహ వివాదం
- రాత్రికి రాత్రే వెలిసిన నంది విగ్రహం
- మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకేనని వైసీపీ నేతల ఆరోపణ
ఇటీవల శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలో విగ్రహాలు ధ్వంసం, పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్ వద్ద విగ్రహ వివాదం నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానిక శాసనసభ్యుడైన అచ్చెన్నాయుడు ప్రోద్బలం మేరకు టీడీపీ నాయకులు ఈ ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు పంపారు. గురువారం సాయంత్రం 5 గంటలకు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఎదుట హాజరుకావాలంటూ అచ్చెన్నాయుడికి ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఇటీవల సంతబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయం వద్ద విగ్రహాల ధ్వంసం ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొన్నిరోజులకే పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్ లో సిమెంట్ దిమ్మెపై నంది విగ్రహం వెలిసింది. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకేనని వైసీపీ నేతలు ఆరోపించారు. వాస్తవానికి ఆ దిమ్మెపై దివంగత ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ఇటీవలే ఆ దిమ్మెపై వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దాంతో రాత్రికి రాత్రే ఆ దిమ్మెపై నంది విగ్రహం వెలిసింది.