New Delhi: ఢిల్లీ ఘటన: 200 మంది అరెస్ట్.. 25 క్రిమినల్ కేసులు
- ఎర్రకోట ముట్టడి, ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్రం సీరియస్
- ఎఫ్ఐఆర్‌లో మేధాపాట్కర్, రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్ పేర్లు
- హర్యానాలో 2 వేల మందిపై కేసు నమోదు
గణతంత్ర దినోత్సవాన దేశ రాజధానిలో జరిగిన రగడపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడి ఘటనలు హింసాత్మకంగా మారడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 25 క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు, 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సారథ్యం వహిస్తున్న రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, మేధాపాట్కర్, దర్శన్ పాల్, గుర్నాంసింగ్ చాదుని సహా మొత్తం 37 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
ట్రాక్టర్ ర్యాలీ, ఎర్రకోట ముట్టడిలో హింసకు దారి తీసిన ఘటనపై దృష్టిసారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొందరు నేతల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం నాటి ఘటనలో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయపడినట్టు పేర్కొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ, ఎర్రకోట ముట్టడితో సమస్యాత్మకంగా మారిన ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు.
మరోవైపు, రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బారికేడ్లను బద్దలుగొట్టేందుకు ప్రయత్నించారంటూ 2 వేల మందిపై హర్యానాలోని పల్వాల్ జిల్లాలో కేసు నమోదైంది.