East Godavari District: దుర్గాడ సర్పంచ్ పదవి ఖరీదు రూ. 33 లక్షలు.. వేలంలో దక్కించుకున్న అభ్యర్థి!
- ఏపీలో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి
- వేలం మొత్తాన్ని గ్రామ శివాలయం అభివృద్ధికి వినియోగం
- వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేయాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవిని వేలానికి ఉంచడం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్దికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో కొనసాగుతున్న వేలం ఆచారం మరోమారు తెరపైకి వచ్చింది. ఇక్కడి సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించగా గతరాత్రి వేలం నిర్వహించారు. మొత్తం నలుగురు సభ్యులు పాల్గొనగా ఓ వ్యక్తి రూ. 33 లక్షలకు పదవిని దక్కించుకున్నాడు. ఈ మొత్తాన్ని గ్రామంలోని శివాలయ నిర్మాణ పనులకు వినియోగించాలని పెద్దలు నిర్ణయించారు.
వేలంలో పదవిని దక్కించుకున్న అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా ఎన్నికల బరిలోకి దిగితే, వేలం పాడిన వ్యక్తినే గెలిపించాలని తీర్మానించారు. అలాగే, వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. 15 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 5 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. అయితే, కమిటీ నిర్ణయించిన వ్యక్తి కాకుండా మరో అభ్యర్థి కూడా పోటీ చేయడంతో వేలంలో పదవి దక్కించుకున్న వ్యక్తిని దేవుడి అభ్యర్థిగా ప్రచారం చేసి గెలిపించుకున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల్లో మరో వ్యక్తి పోటీ చేస్తే అదే పద్ధతిని అవలంబించాలని పెద్దలు నిర్ణయించారు.