Mumbai: శ్రీలంకకు గిఫ్ట్... ఉచితంగా వ్యాక్సిన్ పంపించిన ఇండియా!

India Gifts 5 Lakh Vaccines to Sri Lanka

  • పొరుగు దేశాలకు భారత్ సాయం
  • 5 లక్షల టీకాలు కొలంబోకు
  • ముంబై నుంచి ఏఐ విమానంలో తరలింపు

కరోనాను ఎదుర్కోవడంలో ఇరుగు, పొరుగు దేశాలకు తనవంతు సహకారాన్ని అందిస్తున్న భారత్, తాజాగా, శ్రీలంకకు ఐదు లక్షల డోస్ ల టీకాలను ఉచితంగా అందించింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ లో తయారైన కొవిషీల్డ్ డోస్ లను లంకకు పంపనున్నట్టు ఇండియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం పూణె నుంచి రోడ్డు మార్గాన ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి టీకా వయల్స్ చేరుకోగా, ఎయిర్ ఇండియా విమానం ద్వారా వాటిని కొలంబోకు తరలించారు.

గత సంవత్సరం సెప్టెంబర్ లో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, మోదీ మధ్య చర్చలు జరుగగా, టీకా విషయంలో శ్రీలంకకు సహకరిస్తామని భరోసాను ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాధి ప్రబలిన వేళ, 26 టన్నుల బరువైన మందులు, పీపీఈ కిట్స్, ఇతర పరికరాలను పంపించింది కూడా. ఇటీవలే శ్రీలంక ఔషధ నియంత్రణ మండలి కొవిషీల్డ్ ను వాడకానికి అనుమతించిన నేపథ్యంలో, ఈ 5 లక్షల డోస్ లను రెండున్నర లక్షల మంది డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సాయుధ బలగాల సిబ్బందికి వినియోగించాలని శ్రీలంక భావిస్తోంది.

ఇక ఇండియాలో టీకా తయారీ శరవేగంగా జరుగుతుండగా, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, సీషెల్స్, మయన్మార్ తదితర దేశాలకు ఉచితంగా అందించింది. ఇదే సమయంలో మొరాకో, బ్రెజిల్ తదితర దేశాలకు 20 లక్షల వ్యాక్సిన్ వయల్స్ ను కమర్షియల్ గా ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఇండియాలో తయారవుతున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమకు కావాలని పలు దేశాల నుంచి విజ్ఞాపనలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News