Netaji: ‘జై శ్రీరామ్’ అంటూ అటు నేతాజీని, ఇటు రాముడిని అవమానించారు: ఆరెస్సెస్ బెంగాల్ విభాగం
- ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలేంటని అసహనం
- నేతాజీ అధికారిక జయంత్యుత్సవాల్లో ఘటనపై స్పందన
- ఆ నినాదాలు చేసిందెవరో గుర్తించాలని బీజేపీకి సూచన
ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతుండగా.. కొందరు బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించి అవమానిస్తారా అంటూ ఆమె మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
ఈ ఘటనపై ఆరెస్సెస్ బెంగాల్ విభాగం స్పందించింది. ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలను తాము సమర్థించబోమంది. నేతాజీని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన ఆయన 125వ జయంతి వేడుకల్లో జై శ్రీరామ్ నినాదాలను చేయాల్సింది కాదని ఆరెస్సెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జిష్ణు బసు అన్నారు. ఆరోజు జరిగిన దానికి చాలా చింతిస్తున్నామన్నారు.
జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారు అటు నేతాజీకి, ఇటు రాముడికి గౌరవం ఇవ్వలేదన్నారు. నేతాజీకి నివాళులర్పించేందుకు ఆ కార్యక్రమం పెట్టారని, అక్కడ అలాంటి నినాదాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఆ నినాదాలు చేసిన వారిని బీజేపీ గుర్తించాలని, ఆ కార్యక్రమాన్ని చెడగొట్టడానికే ఎవరైనా కావాలనే ఆ నినాదాలు చేశారా? అనే విషయాలను గుర్తించాల్సిందిగా సూచించారు.
అయితే, ఆ నినాదాలు చేసిన వారు వేరే రాష్ట్రానికి చెందిన నేతలకు సన్నిహితులని బీజేపీ బెంగాల్ నేత ఒకరు చెప్పారు. మమతా బెనర్జీ కూడా ఆ నినాదాలను వివాదాలుగా మార్చి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆరోపించారు.