Peddireddi Ramachandra Reddy: మేనిఫెస్టో విడుదల చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు?: మంత్రి పెద్దిరెడ్డి
- పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి
- వైయస్ ని విమర్శించే అర్హత చంద్రబాబుకి లేదు
- చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ రమేశ్ పని చేస్తున్నారు
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతాయని... అలాంటప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
సొంత జిల్లాలో కూడా మెజారిటీ తెచ్చుకోలేని నేత చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడు ప్రజల కోసం పని చేయలేదని విమర్శించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని... పులివెందులలో ఒక్క రూపాయికే ఆయన వైద్యం అందించారని చెప్పారు. వైయస్ గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.
అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నిలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆయన ఇష్టానుసారం ఆదేశాలను జారీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుచరుడిగా పని చేస్తున్నారని అన్నారు. కరోనా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయతీ 2002 నుంచి వస్తోందని అన్నారు.