Alekhya: మదనపల్లె ఘటన: అలేఖ్య సోషల్ మీడియా ఖాతాలో ఇలాంటి పోస్టులే ఎక్కువ!
- మదనపల్లెలో జంట హత్యలు
- పెద్ద కుమార్తె అలేఖ్య మాటలు నమ్మి హత్యలు చేసిన తల్లిదండ్రులు
- అలేఖ్య, ఆమె సోదరి సాయిదివ్య మృతి
- ఇప్పటికీ ఉన్మాదంలోనే తల్లిదండ్రులు
- అలేఖ్య మనో వైకల్యానికి అద్దంపడుతున్న పోస్టులు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ కుటుంబంలో మూఢ విశ్వాసాలు రేపిన చిచ్చు రెండు ప్రాణాలను బలిగొంది. పద్మజ, పురుషోత్తంనాయుడు దంపతులు తమ పెద్ద కుమార్తె అలేఖ్య ప్రభావంలో పడి ఘాతుకానికి పాల్పడ్డ వైనం ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తోంది. అంధ విశ్వాసాలు ఎంతపని చేస్తాయో చెప్పేందుకు ఈ జంట హత్యలు బలమైన నిదర్శనాలు. పోలీసుల అదుపులోనూ తల్లి పద్మజ మాట్లాడుతున్న పొంతనలేని విషయాలు వారిపై పెద్ద కుమార్తె అలేఖ్య ప్రభావం ఎంతగా ఉందో చెబుతాయి.
తాజాగా అలేఖ్య గురించి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు విపరీత మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. శివుడు వస్తున్నాడు, పని పూర్తయింది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. అంతేకాదు, తన పేరును మోహినిగానూ మార్చుకుంది. శివ తత్వాన్ని జీర్ణించుకున్న అలేఖ్య... చావు, పుట్టుకలకు తానే కర్తనని బలంగా నమ్మేది. ఈ నమ్మకమే ఆమెతో పాటు ఆమె చెల్లి చావును కూడా లిఖించింది.
కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ సమయంలో ఇంటివద్దే ఉన్న అలేఖ్య విపరీతంగా పుస్తకాలు చదివింది. వాటిలో అత్యధికం పురాణ గ్రంథాలు, ఆధ్యాత్మికం, స్త్రీవాద పుస్తకాలే ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఓషో రజనీశ్ ను విపరీతంగా అభిమానించేది. అతడ్నే ఆరాధిస్తూ తన గదిలో అతడి ఫొటో కూడా పెట్టుకుంది. అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ లోని పోస్టులు పరిశీలిస్తే వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఎంతో నైరాశ్యంలోనూ ఆమె ఆర్ద్రత నిండిన ఓ కవిత రాసింది.
"నా హృదయం మౌనంగా రోదిస్తోంది... ప్రతి ఒక్కరినీ మెప్పించేందుకు నన్ను నేనే కోల్పోతున్నాను, ఇంకెవరినో అవుతున్నాను. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు... కలలన్నీ భగ్నమైపోయాయి.... నిరాశ అనే అగాధంలో నిలువునా కూరుకుపోయాను. లెక్కకుమిక్కిలిగా పుట్టుకువచ్చే ప్రశ్నలకు బదులు ఇవ్వలేక అయోమయంలో చిక్కుకుపోయాను... ఇలాంటి సమయంలో నాలో కొత్త ఆలోచనలు పురివిప్పాయి... వాటిని నేను మనసారా ఆహ్వానిస్తున్నాను" అంటూ ఓ పోస్టులో పేర్కొంది. ఏదేమైనా ఎంతో ఉన్నతవిద్యావంతులు సైతం మూఢభక్తి విశ్వాసాలతో తమ జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవడం బాధాకరం!