Vijayashanti: పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆంక్షలపై నిప్పులు పోసింది: విజయశాంతి
- విమర్శల పాలవుతున్న తెలంగాణ పీఆర్సీ నివేదిక
- ప్రభుత్వంపై విజయశాంతి విమర్శలు
- ఉద్యోగులు రోదించే పరిస్థితి ఉందన్న విజయశాంతి
- కమీషన్ రాదని తెలిస్తే సీఎం ఏ పనీ చేయరని ఎద్దేవా
తెలంగాణ ప్రభుత్వం వేతన సవరణ సంఘం నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాసేలా వేచిచూసిన తర్వాత వెలువడిన పీఆర్సీ సిఫారసులు దారుణమని, ఈ ప్రభుత్వంలో ఎందుకు ఉన్నామా అని ఉద్యోగులు రోదించే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ పీఆర్సీ నివేదిక ఉద్యోగుల ఆకాంక్షలపై నిప్పులు పోసిందని విమర్శించారు. గడచిన 45 ఏళ్లలో అతి తక్కువగా 7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేసిన పీఆర్సీ నివేదిక ఇదేనని తెలిపారు.
ఉద్యోగులు 65 శాతం ఫిట్ మెంట్ ఆశిస్తే... పీఆర్సీ సిఫారసు అందులో సగం కూడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కమీషన్ రాదని తెలిస్తే ఈ ముఖ్యమంత్రి ఫిట్ మెంట్ సహా మరే ఖర్చును కూడా అంగీకరించరని విజయశాంతి ఎద్దేవా చేశారు. కమీషన్లు దొరికే మోసపు ప్రాజెక్టులకు మాత్రం ఏంతైనా బేఫికర్... వేల, లక్షల కోట్ల రూపాయల అప్పులకైనా బరాబర్ తయారవుతారని వ్యంగ్యం ప్రదర్శించారు.