Chandrababu: గెలిపిస్తే ఊరికి ఏం చేస్తారో వివరిస్తూ ప్రజల్ని మెప్పించాలి: నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు
- మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
- నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- మేనిఫెస్టో ప్రతులు ఇంటింటికీ పంచాలని సూచన
- ప్రతి చోటా నామినేషన్లు వేయాలని వెల్లడి
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 'పల్లె ప్రగతి-పంచ సూత్రాలు' పేరిట మేనిఫెస్టో రిలీజ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలపై టీడీపీ అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. 'పల్లె ప్రగతి-పంచ సూత్రాలు' కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. 'పల్లెలు మళ్లీ వెలగాలి' అనే కరపత్రాలను కూడా ప్రతి ఇంటికీ పంచాలని తెలిపారు. గెలిపిస్తే ఊరికి ఏంచేస్తారో వివరిస్తూ ప్రజల్ని మెప్పించాలి అని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడ ఘర్షణలు తలెత్తినా పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నెంబరు (73062 99999)ను కూడా పంచుకున్నారు. ఫొటోలు, వీడియో సాక్ష్యాలను 75575 57744 నెంబరుకు పంపాలని సూచించారు.
సలహాలు అందించేందుకు పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారని వివరించారు. అన్ని స్థానాల్లో నామినేషన్లు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే తగినరీతిలో బుద్ధి చెప్పాలని అన్నారు.