Devineni Uma: సుప్రీం తీర్పు తర్వాత తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జగన్ భావించారు: దేవినేని ఉమ
- పంచాయతీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు
- ప్రభుత్వాన్ని రద్దు చేయాలని భావించిన జగన్
- ఆ వెంటనే జగన్ పాలనపై వ్యతిరేకత ఉన్నట్టు చెప్పిన ఇంటెలిజెన్స్
- జగన్ తన మనసు మార్చుకున్నారన్న దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైఎస్ జగన్ అహం దెబ్బతిన్నదని, ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆయన ఆలోచించారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నందిగామలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల్లో తన పాలనపై వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకుని ప్రభుత్వ రద్దు ఆలోచనను విరమించుకున్నారని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యులతో సమావేశమైన జగన్, ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారని, అయితే, అందుకు వ్యతిరేకించిన నేతలు, నాలుగు గంటల పాటు మల్లగుల్లాలు పడి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జగన్ ను కోరారని, అదే సమయంలో నిఘా వర్గాల సమాచారం కూడా రావడంతో జగన్ మనసు మార్చుకున్నారని ఉమ అన్నారు.
ఇప్పుడు ఎన్నికలకు వెళితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావన్న సమాచారం ప్రభుత్వానికి అందిందని, దీంతో కంగుతున్న జగన్, ఎన్నికల సంఘానికి సహకరిస్తామని ప్రకటించారని అన్నారు. ఆపై 24 గంటలు తిరక్కుండానే మరోసారి ఎస్ఈసీపై విషం కక్కే ప్రయత్నాలు ప్రారంభించారని ఉమ ఆరోపించారు. ఈసీకి సమాచారం ఇవ్వకుండానే ఏకగ్రీవాలపై సమాచార శాఖ ద్వారా ప్రకటనలు ఇప్పించారని, ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్టేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.