Corona Virus: ఏపీ, తెలంగాణలలో భిన్నమైన కరోనా వైరస్: సీసీఎంబీ
- కొత్త వైరస్‌కు ‘ఎన్440కె’ అని పేరు
- పాత దానితో పోలిస్తే కొంత బలహీనంగా ఉందన్న శాస్త్రవేత్తలు
- ప్రస్తుతం దాని వ్యాప్తి విస్తృతంగానే ఉందని వెల్లడి
కరోనా వైరస్‌పై హైదరాబాద్‌లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్‌కు భిన్నమైన కరోనా వైరస్‌ను గుర్తించినట్టు చెప్పారు. అయితే, ఇతర రకాల కంటే ఇది కొంత బలహీనంగా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ భిన్నమైన కరోనా రకానికి ‘ఎన్440కె’ అని పేరు పెట్టారు.
దేశంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభిస్తామన్నారు. ఏపీ, తెలంగాణలలో వెలుగుచూసిన కరోనా వైరస్ పూర్తిగా కొత్త రకం కాదని, భిన్నమైన రకమేనని రాకేశ్ వివరించారు. దీని వ్యాప్తి పరిమితంగానే ఉందని, గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొన్ని కేసుల్లో ఇది కనిపించిందని తెలిపారు.
ఇప్పుడు మాత్రం ఇది విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. పాత వైరస్ బలహీనపడడం ద్వారా ఇది పుట్టుకొచ్చి ఉండొచ్చన్నారు. ఇది సోకినవారిలో లక్షణాలు చాలా స్వల్ప స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. ఈ వైరస్ రకంపై పెద్దగా డేటా లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు అవసరమని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.