Nimmagadda Ramesh Kumar: అందులో సీఎం జగన్ ఫొటోను తొలగించండి: సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ
- అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాల జారీపై లేఖ
- ఎన్‌ఓసీల జారీ అంశంపై కూడా సూచనలు
- ఆ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం నియమావళికి విరుద్ధం
- తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీల జారీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖ రాశారు.
ధ్రువీకరణ పత్రాలపై సీఎం జగన్ ఫొటో తొలగించాలని చెప్పారు. ఆ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని, వాటిని తొలగించేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు ఆయన చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ దశలో మొత్తం 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులు ఉన్నాయి. వచ్చేనెల 9న తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.