Nimmagadda Ramesh Kumar: ఎన్నికల విధుల నుంచి సీఎం ముఖ్య కార్యదర్శిని తొలగించండి: ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ
- ప్రవీణ్ ప్రకాశ్ సమీక్షలు జరపకుండా చూడండి
- సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు
- ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారు
- నా ఆదేశాలను పట్టించుకోలేదు
- అందుకే ఎన్నికల షెడ్యూల్ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న తొలి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభించినప్పటికీ, కొందరు అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించలేకపోయారు.
దీంతో వారు వెనుదిరిగి వెళ్లడంతో టీడీపీ నేతలూ దీనిపై మండిపడ్డారు. అంతేగాక, ఎన్నికల సంఘం నిర్వహించాలనుకున్న సమావేశానికి అధికారులు హాజరుకాలేదు. దీనికి బాధ్యులపై ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఆయన మరో లేఖ రాశారు.
ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలివ్వాలని సీఎస్‌కు చెప్పారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ విఫలమయ్యారని ఆయన తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు.