Ram Nath Kovind: జాతీయ జెండాకు అవమానం జరగడం దారుణం: రాష్ట్రపతి కోవింద్
- భావ ప్రకటనా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు
- ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమానంగా తీసుకోవాలి
- రైతుల ప్రయోజనాల కోసమే 3 కొత్త వ్యవసాయ చట్టాలు
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోటపై రైతులు మతపరమైన జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కలకలం రేపింది. ఎంతో మంది భారత పౌరులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిందని... కానీ, కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పశుధన్ పథకం ప్రతి ఏడాది 8 శాతానికి పైగా వృద్ధి చెందుతోందని చెప్పారు. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్ లకు ఆమోదం తెలిపామని తెలిపారు. దేశ ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో లేకుండా చూశామని తెలిపారు. 80 కోట్ల మందికి 8 నెలల పాటు 5 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసమే 3 కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు.