Double Masking: మాస్క్ పై మాస్క్ పెట్టండి... అమెరికా నిపుణుడి సలహా
- అనేక దేశాల్లో కరోనా కొత్త రకం వ్యాప్తి
- డబుల్ మాస్కు పద్ధతి మేలంటున్న ఆంటోనీ ఫౌచీ
- మరింత రక్షణ కలుగుతుందని వెల్లడి
- సర్జికల్ మాస్కు, క్లాత్ మాస్కు కాంబో మంచి ఫలితాలనిస్తుందని వివరణ
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక ప్రజలకు మాస్కు ఓ రక్షణ కవచంలా నిలిచింది. అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కొవిడ్ నుంచి మరింత రక్షణ కావాలంటే డబుల్ మాస్కు తప్పనిసరి అంటున్నారు. మాస్కుపై మాస్కు పెట్టుకుంటే అదనపు భద్రత కలుగుతుందని, ఈ విధానం మరింత మెరుగైన పనితీరు ప్రదర్శిస్తుందని ఫౌచీ వివరించారు. ఒక మాస్కు ధరించిన వారు దానిపై మరో మాస్కు ధరిస్తే మరింతగా రక్షణ లభిస్తుందని తెలిపారు.
అనేక దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ లు విజృంభిస్తున్న తరుణంలో డబుల్ మాస్కు పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని ఫౌచీ భావిస్తున్నారు. ఒక మాస్కు ధరించినప్పుడు ఏవైనా ఖాళీలు కనిపిస్తుంటే రెండో మాస్కుతో ఆ ఖాళీలను కప్పివేయవచ్చని వివరించారు. దీనివల్ల శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయని అన్నారు. ఈ విధానంలో సర్జికల్ మాస్కు, క్లాత్ మాస్కు కాంబో ప్రయోజనకరంగా ఉంటుందని ఫౌచీ తెలిపారు.