Nimmagadda Ramesh: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలను తొలగించండి: గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
- సజ్జల పరిధి దాటి మాట్లాడుతున్నారు
- బొత్స, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధం
- సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించండి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం పెరుగుతోంది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. సజ్జల లక్ష్మణ రేఖ దాటారని అన్నారు.
సజ్జలతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వారి పరిధులు దాటి మాట్లాడుతున్నారని నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. తనపై మంత్రులు చేస్తున్న విమర్శలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని చెప్పారు. అడ్వొకేట్ జనరల్ పై కూడా తనకు నమ్మకం లేదని అన్నారు. కోర్టుకు వెళ్లకుండా, ఈ విషయాలన్నింటినీ తమ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను తొలగించాలని, అలాగే ఎన్నికల నేపథ్యంలో, కుల ధృవీకరణ పత్రాలపై జగన్ ఫొటోలను తొలగించాలని నిమ్మగడ్డ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఓటర్లపై ఈ ఫొటోలు ప్రభావం చూపుతాయని అన్నారు. అభ్యర్థులకు ఇచ్చే ఓన్ఓసీల విషయంలో కూడా వివక్ష లేకుండా చూడాలని కోరారు.