Sajjala Ramakrishna Reddy: రాజులు, పాలెగాళ్ల తరహాలో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు: సజ్జల విమర్శలు
- ఎస్ఈసీపై సజ్జల ధ్వజం
- అధికారులపై కక్ష సాధిస్తున్నారని ఆరోపణ
- పరిధిని మించి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు
- టీఎన్ శేషన్ ను ప్రస్తావించిన సజ్జల
- ఎలా ఐఏఎస్ అయ్యారంటూ ఆశ్చర్యం
తనతో సహా పలువురు కీలక అధికారులపై వేటు వేయాలంటూ సిఫారసులు గుప్పిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. పంచాయతీ ఎన్నికలపై ముందే ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా వ్యవహరిస్తూ, దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేస్తూ, కక్ష సాధింపు తరహాలో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గత వారం రోజులుగా ఆయన చేష్టలు అందుకు పరాకాష్ఠ అని తెలిపారు.
ఆయన భాష, సీనియర్ అధికారుల పట్ల దుందుడుకుగా, నియంతలా ప్రదర్శిస్తున్న పోకడలు పరిధిని మించిపోయాయని అన్నారు. బాధ్యతాయుతంగా ఎన్నికలు నిర్వహించడం ఆయనకు అప్పగించిన బాధ్యత అని, పరిధిలోకి లోబడి చర్యలు తీసుకోవాలని చెబుతున్న అధికారాలను మీరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీ అధికారాలు తనకు జన్మతః వచ్చిన హక్కుగా భావిస్తూ, రాజులు, పాలెగాళ్ల తరహాలో అపరిమిత అధికారాలు చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచనపరుడిలా వ్యవహరించాల్సిన స్థానంలో ఉన్న నిమ్మగడ్డ అందుకు భిన్నంగా ముందుకు పోతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో టీఎన్ శేషన్ మూసపద్ధతిలో ఉన్న విధానాలు తొలగించి నూతన విధానాలు ప్రవేశపెట్టినా, అది తన అధికారాలకు, పరిధిలోకి లోబడి తీసుకున్న నిర్ణయాలేనని సజ్జల ప్రస్తావించారు. నాడు శేషన్ విప్లవాత్మక సంస్కరణలతో రాజకీయనేతలు ఇబ్బంది పడినా, ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిధికి లోబడినవి కావడంతో ఎవరూ అడ్డుచెప్పలేదని స్పష్టం చేశారు. అయితే, నిమ్మగడ్డ అందుకు పూర్తి విరుద్ధం అని అన్నారు.
గతంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించారని, నాటి ముఖ్యమంత్రి తన గదిలోకి వచ్చి ప్రశ్నించిన సమయంలోనూ విధి నిర్వహణకే కట్టుబడ్డారని, వాస్తవానికి ద్వివేది నాడు చంద్రబాబుపై హత్యాయత్నం ఫిర్యాదు చేసే వీలున్నా, ఆయన వృత్తి ధర్మానికే కట్టుబడ్డారని కొనియాడారు. నిమ్మగడ్డ ఐఏఎస్ ఎలా అయ్యారో తెలియదని, అన్నిరోజుల పాటు సర్వీసులో ఎలా ఉన్నారో తెలియడంలేదని అన్నారు. తాను ఎస్ఈసీని విమర్శించడంలేదని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను విమర్శిస్తున్నానని సజ్జల స్పష్టం చేశారు.