Chittoor District: అలేఖ్యను చంపిన తర్వాత నాలుక కోసి తినేసిన పద్మజ: వెలుగులోకి విస్తుపోయే నిజాలు
- పద్మజ, పురుషోత్తంలను విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించాలని సిఫారసు
- పద్మజ కుటుంబ సభ్యుల్లోనూ మానసిక సమస్యలు
- తండ్రి నుంచి పద్మజకు, ఆమె నుంచి కుమార్తెలకు వచ్చిన వ్యాధి
చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన కన్న కుమార్తెల హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య (27) నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు వైద్యులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు విశ్వసించానని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. పద్మజ, పురుషోత్తం ఇద్దరిలోనూ మానసిక వ్యాధి లక్షణాలు ఉండడంతో వారిని విశాఖపట్టణంలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫారసు చేసినట్టు తిరుపతిలోని రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
తన బిడ్డలు తిరిగి వస్తున్నారని, వెంటనే ఇంటికి వెళ్లాలని చెబుతున్న పద్మజ.. జైలులో తనకు తోడుగా ఉన్న శివుడు, కృష్ణయ్య కనిపించడం లేదని వైద్యులకు చెబుతోంది. మరోవైపు, వారి రక్తసంబంధీకుల్లోనూ మానసిక సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పద్మజ తండ్రి ఏకంగా 20 ఏళ్లపాటు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడినట్టు తేలింది. పద్మజ మేనమామలోనూ ఇలాంటి లక్షణాలే ఉన్నాయని, తండ్రి నుంచి పద్మజకు, ఆమె నుంచి ఆమె కుమార్తెలకు వంశపారంపర్యంగా ఇది సంక్రమించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.