Devineni Uma: ప్రజలను భయపెడుతున్నారు: దేవినేని ఉమ
- ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు
- పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఇటువంటి బెదిరింపులకు లొంగిపోకూడదు
- 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటో కూడా జగన్ చెప్పలేని స్థితి
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ప్రజలను భయపెట్టి ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఇటువంటి బెదిరింపులకు లొంగిపోకూడదని, ధైర్యంగా నిలబడాలని అన్నారు.
టీడీపీ బలపర్చుతోన్న అభ్యర్థులు గెలిస్తే వారు గ్రామాల్లో ఏయే కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని తాము దమ్ముతో, నిజాయితీతో ప్రకటించామని చెప్పారు. ఈ మేరకు టీడీపీ అధినేత ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాల హామీ ఏమైందని నిలదీశారు. 18 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటో కూడా జగన్ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వీఆర్వోలు అందుబాటులో ఉండట్లేదని అన్నారు. వీఆర్వోలు అందుబాటులో లేకుండా అధికార పార్టీ కుట్ర చేస్తోందని అన్నారు.