Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ సోదరుడి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
- బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ
- జగత్ కి బెయిల్ ఇవ్వొద్దని కోరిన పోలీసులు
- బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాదన
హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సికింద్రాబాదులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
ఈ కేసులో ఇంకొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని... ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు... జగన్ పిటిషన్ ను తిరస్కరించింది. మరోవైపు, ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన 15 మంది బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.
కేసు విషయానికి వస్తే... హైదరాబాద్ మియాపూర్ సమీపంలో ఉన్న హఫీజ్ పేటలో ఉన్న 48 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి ప్రవీణ్ రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేశారు. ఈ భూమి విలువ దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కేసులో అఖిలప్రియను ఏ1గా, సుబ్బారెడ్డిని ఏ2గా, అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను ఏ3గా పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇటీవలే అఖిలప్రియకు బెయిల్ వచ్చింది.