Chittoor District: మదనపల్లె జంట హత్యల కేసు.. అనుమానాలున్నాయన్న న్యాయవాది
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు
- నిందితుడు పురుషోత్తంనాయుడును కలిసి మాట్లాడిన న్యాయవాది పద్మజ
- నిందితుల ఆధ్యాత్మక చింతనకు, హత్యలకు సంబంధం ఉండకపోవచ్చని వ్యాఖ్య
సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో రోజుకో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వస్తున్న వేళ న్యాయవాది రజిని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మదనపల్లె సబ్‌జైలులో ఉన్న నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను కలిసేందుకు రజిని నిన్న ప్రయత్నించారు. అయితే, వారిని నేరుగా కలిసి మాట్లాడేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో జైలు ద్వారం వద్ద దూరంగా నిలబడి పురుషోత్తంతో మాట్లాడారు. అనంతరం సోమవారం రావాలంటూ అధికారులు ఆమెను అక్కడి నుంచి పంపించి వేశారు.
ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. నిందితులకు న్యాయ సహాయం అవసరమని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. హత్యాస్థలంలో కనిపించినవని క్షుద్రపూజలకు సంబంధించినవి కావని, ఈ హత్యలకు, నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కృష్ణమాచార్య తరపున నిందితులను కలిసేందుకు తాను వచ్చినట్టు రజిని తెలిపారు.