Myntra: ‘మింత్రా’ లోగో మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదు.. మారుస్తున్నట్టు చెప్పిన ఈ-కామర్స్ సంస్థ!
- లోగోపై ఫిర్యాదు చేసిన నాజ్ పటేల్
- అభ్యంతరకరంగా ఉందని నిర్ధారించిన పోలీసులు
- నెలలోపు మార్చేస్తామన్న మింత్రా
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన‘మింత్రా’ లోగో అభ్యంతరకరంగా, మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైంది. అవెస్తా ఫౌండేషన్‌కు చెందిన నాజ్ పటేల్ ఫిర్యాదు మేరకు గతేడాది డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మింత్రా లోగో మహిళలను అవమానపరిచేలా ఉందని, దానిని మార్చేలా చర్యలు తీసుకోవాలంటూ నాజ్ పటేల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు లోగో అభ్యంతరకరంగానే ఉన్నట్టు నిర్దారించారు. దీంతో సంస్థకు, దాని అధికారులకు పోలీసులు నోటీసులు పంపారు. స్పందించిన సంస్థ లోగోను మారుస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. నెల రోజుల్లోపే లోగోను మార్చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ముంబై సైబర్ క్రైం డీసీపీ రష్మీ కరండికార్ తెలిపారు. పోలీసులకు ఇచ్చిన హామీ మేరకు లోగోను మింత్రా సరికొత్తగా డిజైన్ చేస్తోంది. ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తోంది. కొత్త లోగోతో ఇప్పటికే ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు మింత్రా తెలిపింది.