Narendra Modi: 'మన్ కీ బాత్' లో టీమిండియాపై మోదీ ప్రశంసలు... కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ
- ఇవాళ ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమం
- ఆసీస్ టూర్లో టీమిండియా విజయంపై మోదీ వ్యాఖ్యలు
- సమష్టి కృషితో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కితాబు
- దేశం కోసం టీమిండియా దేన్నైనా సాధ్యం చేస్తుందన్న బీసీసీఐ
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 'మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నెలలో భారత జట్టు శుభవార్త అందించిందని అన్నారు. ఆస్ట్రేలియా టూర్లో ఆరంభంలో కష్టాలు ఎదుర్కొన్నా, ఆపై అద్భుతంగా పుంజుకుని ఘనవిజయం సాధించారని కొనియాడారు. మన ఆటగాళ్ల కఠోరశ్రమ, సమష్టికృషి స్ఫూర్తిదాయకం అని కితాబిచ్చారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది.
భారత జట్టు పట్ల ఎంతో ప్రోత్సాహకర వచనాలు పలికిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అంటూ స్పందించింది. భారత త్రివర్ణ పతాకాన్ని సమున్నత రీతిలో రెపరెపలాడించేందుకు టీమిండియా దేన్నైనా సాధ్యం చేస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో భారత్ తొలి టెస్టును ఓడిపోయిన తర్వాత అద్భుత రీతిలో పుంజుకుని చివరికి 2-1తో సిరీస్ ను గెలుచుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని అచ్చెరువొందించింది.