Uttam Kumar Reddy: హైదరాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ రైలు మంజూరు చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- బడ్జెట్ లో రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది
- కేంద్రం తీరు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది
- తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనం
కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలకు న్యాయం చేసేలా బడ్జెట్ లేదని... ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల బడ్జెట్ మాదిరి ఉందని చెప్పారు. ఎన్నికలు ఉన్న ఐదు రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తెలంగాణకు ఇచ్చింది శూన్యమని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పడానికి ఈ బడ్జెటే నిదర్శనమని చెప్పారు.
పంట సేకరణ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఇదే సమయంలో రైతు సమస్యలపై ఎందుకు మాట్లాడలేకపోయిందని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేస్తుంటే కనీస మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్ తో పాటు బుల్లెట్ రైలును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు.