Amanchi Krishna Mohan: వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు
- హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఆమంచి
- వారిని ముక్కలుగా నరకాలంటూ కామెంట్లు
- సీబీఐ విచాణకు ఆదేశించిన హైకోర్టు
చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ఈ నెల 6వ తేదీని విశాఖలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి.
న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగాలు ఆమంచిపై ఉన్నాయి. న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ పోస్టులు పెట్టారని కేసులు నమోదయ్యాయి. ఆమంచితో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పలువురిపై కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. కొందరికి కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది.