Nimmagadda Ramesh: ఎసీఈసీ నిమ్మగడ్డపై చర్యలు ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని
- నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చిన బొత్స, పెద్దిరెడ్డి
- ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలని విన్నపం
- ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపిన స్పీకర్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని తమ నోటీసుల్లో వారు పేర్కొన్నారు. నిమ్మగడ్డ ఆయన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని చర్యలకు ఉపక్రమించారు. ఈ నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు.
తమ్మినేని చర్యతో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఎస్ఈసీపై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందా? అనే చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ ఆ అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉన్నట్టయితే... నిమ్మగడ్డపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది.