Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు హత్య కేసు.. నిందితుల్లో ఒకరి ఆత్మహత్య

Accused tried to suicide in Siddharth murder case and one dead

  • సిద్ధార్థ్ దేవేందర్ హత్యకేసులో ఇద్దరు నిందితులు
  • పోలీసులకు విషయం తెలిసిపోయిందని భయం
  • ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
  • రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన వినోద్
  • ఉరివేసుకున్న శ్యాంసుందర్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్యకేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాలతో బయటపడగా, మరొకడు మృతి చెందాడు.

 పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చిన సిద్దార్థ్ గత నెల 19న స్నేహితులను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో తిరుపతి కొర్లగుంటకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి (28), వినోద్‌లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. బీటెక్ పూర్తిచేసిన శ్యాంసుందర్‌రెడ్డి ఉద్యోగాల కోసం 2014 నుంచి చెన్నై, బెంగళూరు మధ్య చక్కర్లు కొడుతున్నాడు. ఇటీవల గత కొంతకాలంగా బెంగళూరులోని వినోద్ వద్ద ఉంటున్నాడు.

సిద్ధార్థ్ హత్య కేసులో వీరిద్దరి పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విషయం తెలిసిన శ్యాంసుందర్, వినోద్‌లు భయపడ్డారు. పోలీసులు ఎలాగైనా తమ ఇంటికి వస్తారని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి-రేణిగుంట మార్గంలో రైలు కింద పడడానికి వినోద్ యత్నించాడు. అయితే, రైలు వేగానికి పక్కకు పడిపోయాడు. కాలు, చేయి విరిగి విలవిల్లాడుతున్న అతడిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అంతకు నాలుగు రోజుల ముందే శ్యాంసుందర్ ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి శ్రీనివాసం వెనక ఉన్న తాళ్లపాక చెరువు ముళ్లపొదల్లోని చెట్టుకు శ్యాంసుందర్ తన చొక్కాతో ఉరివేసుకున్నాడు. నిన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడి ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.

శ్యాంసుందర్ తండ్రి మాత్రం కుమారుడి ఆత్మహత్యకు మరో కారణం చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో స్థిరపడలేదన్న ఆవేదనతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. గత నెల 22న తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధార్థ్ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News