Pattabhi: నాపై దాడి వెనుక కొడాలి నాని హస్తం ఉంది: పట్టాభి
- వల్లభనేని వంశీ ఇంట్లో కొడాలి నానితో మరికొందరు సమావేశమయ్యారు
- హైకోర్టు జడ్జిలు కూడా ఉండే ప్రాంతంలో నాపై దాడి జరిగింది
- ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని జగన్ కు చెపుతున్నా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఆయన నివాసం వద్దే ఆయనపై దాడి జరిగింది. జడ్జిలు కూడా నివాసం ఉంటున్న హై సెక్యూరిటీ జోన్ లో ఆయన కారును చుట్టుముట్టిన కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆయన సెల్ ఫోన్ కూడా ధ్వంసమయింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే ఉన్నారు. డీజీపీ లేదా పోలీస్ కమిషనర్ వచ్చి, తనకు సమాధానం చెప్పేంత వరకు తాను ఇక్కడ నుంచి కదలనని ఆయన చెప్పారు. చికిత్స పొందుతున్న పట్టాభిని పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో పట్టాభి మాట్లాడుతూ, దాదాపు 10 మంది కాపుకాసి తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు. తనతో పాటు, తన డ్రైవర్ పై కూడా దాడికి పాల్పడ్డారని చెప్పారు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందునే తనను టార్గెట్ చేశారని తెలిపారు.
గత 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు ఉండే ప్రాంతంలో తనపై దాడి జరిగిందని... రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన తెలియజేస్తోందని అన్నారు.
అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ లొంగిపోయి పని చేస్తోందని పట్టాభి ఆరోపించారు. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కొడాలి నానితో పాటు మరికొందరు సమావేశమై చర్చించారని చెప్పారు.
రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఒక పథకం ప్రకారమే తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ కు చెపుతున్నానని అన్నారు.