New Delhi: రైతులను అడ్డుకునేందుకు జాతీయ రహదారిపై మేకులతో సిమెంట్ గోడలు కడుతున్న పోలీసులు!
- రహదారిపై సిమెంట్ పోతతో మేకులు
- ఇనుప బారికేడ్లు, బలమైన గోడలు
- వంతెనలు నిర్మించాలని సెటైర్లు వేసిన రాహుల్ గాంధీ
సాగు చట్టాలు వద్దంటూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులు ప్రవేశించకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సరిహద్దుల వద్ద రోడ్లపై సిమెంట్ ఫ్లోర్ పై మేకులు అమర్చడంతో పాటు, పెద్ద పెద్ద ఇనుప బారికేడ్లను, రోడ్లపైనే బలమైన గోడలను పోలీసులు కడుతున్నారు.
సింఘూ సరిహద్దుల వద్ద రెండు వరుసల ఇనుపరాడ్లను నేలలోకి పాతారు. అక్కడే మూడు అడుగుల వెడల్పు ఉన్న గోడను కట్టారు. ఇటీవల రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగినట్టుగా మరోసారి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు అంటున్నా, వారి చర్యలపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా, పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన చిత్రాలను పంచుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు, రోడ్లపై గోడలు వద్దని, బ్రిడ్జిలను నిర్మించాలని సెటైర్లు వేశారు. ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు దేశవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తామని రైతులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, అంతవరకూ తమ నిరసనలు ఆగబోవని కూడా రైతులు స్పష్టం చేస్తున్నారు.